‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్'... విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

  • విశాఖపట్నం చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
  • విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
  • 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' అంటూ ప్లకార్డులతో స్వాగతించిన యువత
  • ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న లోకేష్
  • గూగుల్ ప్రతినిధులతో సమావేశం కానున్న ఐటీ శాఖామంత్రి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. నగర పర్యటన నిమిత్తం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు.

టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో యువత వినూత్నంగా మంత్రికి స్వాగతం పలికింది. ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

నగర పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరవుతారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. వారికి సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలుకుతారు.

అనంతరం, ఈ రోజు రాత్రి నోవాటెల్ హోటల్‌లో గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన తేనీటి విందులో మంత్రి లోకేష్ పాల్గొంటారు. ఐటీ శాఖామంత్రిగా ఆయన గూగుల్ ప్రతినిధులతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

రేపు (ఏప్రిల్ 28) విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విశాఖ నగరంలో కోలాహలం మిన్నంటుతోంది. 


Nara Lokesh
Vizag
Google Data Hub
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News